మధుమేహం మూలికా ఔషధం



సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వ పరిశోధనా సంస్థ ‘సీఎస్‌ఐఆర్‌’ సారథ్యంలో మధుమేహానికి కొత్త మందు వెలువడింది. ఆయుర్వేద మూలికా ఔషధాలనే ప్రాతిపదికగా తీసుకుని రెండు ప్రతిష్ఠాత్మక భారత పరిశోధనా సంస్థలు సంయుక్తంగా ‘బీజీఆర్‌-34’ పేరుతో రూపొందించిన ఈ ఔషధం మార్కెట్లోకి రావటంతో తాజాగా మధుమేహ చికిత్సా రంగంలో సరికొత్త ఆసక్తి మొదలైంది. ఈ నేపథ్యంలో ఈ కొత్త మందులో ఏమేం ఉన్నాయి? దీనితో ఎవరికి ప్రయోజనం ఎక్కువ? అసలు సనాతన ఆయుర్వేద శాస్త్ర విజ్ఞానంలో మధుమేహ చికిత్స గురించి ఏం చెప్పారు? ఇప్పటి వరకూ మన దేశీయమైన మూలికలు, ద్రవ్యాలపై జరిగిన పరిశోధనలు ఏం చెబుతున్నాయి? ఈ ఆసక్తికర వివరాన్నింటినీ స్థూలంగా మీ ముందుకు తెస్తోంది ఈ వారం సుఖీభవ!


కొత్త వారికి ఉత్తమం!
భారత శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధనా మండలి (సీఎస్‌ఐఆర్‌) ఆధ్వర్యంలో మధుమేహానికి మూలికా ఔషధం వెలువడటం వెనుక లక్నోలోని రెండు పరిశోధనా సంస్థలు ముఖ్య పాత్ర పోషించాయి. ఆయుర్వేద ఔషధ విజ్ఞానాన్ని ఆధారంగా చేసుకుని- జాతీయ వృక్ష పరిశోధనా సంస్థ (ఎన్‌బీఆర్‌ఐ); కేంద్రీయ వైద్య, సుగంధ వృక్ష పరిశోధనా సంస్థ (సిమ్యాప్‌) రెండూ కలిసి సంయుక్తంగా ‘బీజీఆర్‌-34’ ఔషధాన్ని ఆవిష్కరించాయి. దీని ప్రత్యేకతలేమిటో తెలుసుకునేందుకు లక్నోలోని ఎన్‌బీఆర్‌ఐ సీనియర్‌ శాస్త్రవేత్త డా॥ ఎ.కె.ఎస్‌.రావత్‌ తో ‘సుఖీభవ’ సంభాషించింది. వివరాలు...
సాధారణంగా మధుమేహం వచ్చిందనగానే చాలామంది ఆకు పసర్లు, మూలికల వంటి జానపద వైద్యాలను ఆశ్రయిస్తుంటారు. లేదంటే చిట్కా వైద్యాలు మొదలుపెట్టి కాకర రసం తాగటం, మెంతులు తినటం వంటివి చేస్తుంటారు. కానీ వీటికి మోతాదులు తెలియకపోవటం వల్ల కొన్నిసార్లు ఒక చెంచా తీసుకుంటే, మరికొన్నిసార్లు ఐదారు చెంచాలు తీసేసుకుంటుంటారు. మధ్యలో మానేస్తుంటారు కూడా. మొత్తానికి వీటిని ఇష్టం వచ్చినట్టు వాడటం, మానేస్తుండటం వల్ల- ఇది దీర్ఘకాలిక విధానంగా నిలబడేది కాదని అర్థమవుతుంది. దుష్ప్రభావాలు పొంచి ఉండే మధుమేహం విషయంలో ఇలా చెయ్యటం సరికాదు. అందుకని రక్తంలో గ్లూకోజు నియంత్రణకు ఒక సమర్థమైన మూలికా ఔషధాన్ని తీసుకురావాలన్న లక్ష్యంతో గత రెండుమూడేళ్లుగా ఎన్‌బీఆర్‌ఐ, సిమ్యాప్‌లలో సంయుక్తంగా కృషి చేశాం. ఫలితమే తాజా ఔషధం.
ఇది ఇంకా పూర్తిస్థాయి మధుమేహం రాకుండా.. మధుమేహానికి ముందస్తు దశలో (ప్రీక్లినికల్‌ డయాబిటీస్‌) ఉన్నవారికి, అలాగే తాజాగా మధుమేహం బారినపడిన వారికి (ఎర్లీ డయాబిటిక్స్‌) బాగా ఉపయోగపడుతుందని అధ్యయనాల్లో గుర్తించాం. సాధారణంగా మధుమేహం వచ్చిన తొలిరోజుల్లో వ్యాయామం, ఆహారపరమైన జాగ్రత్తలు సిఫార్సు చేస్తుంటారు, ఇటువంటి వారికి ఆ దశలో ఇది చాలా మంచి మందు అవుతుంది. వాస్తవానికి మధుమేహ చికిత్స కోసమంటూ మార్కెట్లో ఇప్పటికే ఎన్నో ఆయుర్వేద, దేశీయ ఔషధాలున్నా.. కేంద్ర పరిశోధనా సంస్థల్లో దీనిపై అధ్యయనం చేసి, ఇది సురక్షితమని నిర్ధారించి విడుదల చెయ్యటం దీని ప్రత్యేకత. ఈ మందు రూపకల్పనలో మేం మౌలికంగా ఆయుర్వేద ఔషధ విధానాన్నే అనుసరించాం. దీనిలో ప్రధానంగా రక్తంలో గ్లూకోజు నియంత్రణ కోసం పనిచేసే దారుహరిద్ర వంటి మూలికలున్నాయి. వీటిలో కొన్ని జీర్ణాశయ స్థాయిలో, కొన్ని పేగుల స్థాయిలో.. ఇలా శరీరంలో వేర్వేరు స్థాయుల్లో పని చేస్తాయి.
వీటికి అదనంగా మేం ‘మంజిష్ట’, ‘గుడూచి’ వంటివీ జోడించాం. మంజిష్టకు ‘యాంటీ ఆక్సిడెంట్‌’గా పనిచేసే స్వభావం ఉంది. గ్లూకోజు నియంత్రణతో పాటు ఇది ఒంట్లో ఉండే హానికారక ‘ఫ్రీ ర్యాడికల్‌’ కణాలను సమర్థంగా ఎదుర్కొని దుష్ప్రభావాలను బాగా తగ్గించేస్తుంది. అలాగే గుడూచి రోగనిరోధక వ్యవస్థను ఉత్తేజితం చేస్తుంది (ఇమ్యూనో మాడ్యులేటర్‌). సాధారణంగా మధుమేహుల్లో రోగనిరోధక వ్యవస్థ కొంతబలహీనపడి ఉంటుంది. దాన్ని దృష్టిలో ఉంచుకునే గుడూచిని చేర్చాం. అందుకే దీన్ని బహుళార్థ సాధక మందుగా (మల్టీ టార్గెటెడ్‌) చెప్పుకోవచ్చు.
ఇదెంత వరకూ సురక్షితమన్న దానిపై మేం అధ్యయనాలు (సేఫ్టీ ట్రయల్స్‌) చేశాం. ఆధునిక వైద్యంలో మధుమేహానికి తొలిగా వాడే ‘మెట్‌ఫార్మిన్‌’తో పోల్చి కూడా చూశాం. ఇది మెట్‌ఫార్మిన్‌తో సరిసమానంగా పని చేస్తోందని నిర్ధారణ అయ్యింది. మనుషులపై ప్రయోగించి చూసే సదుపాయాలు మా వద్ద లేకపోవటంతో దీన్ని ఎయిమిల్‌ ఫార్మా వారికి అందించాం. వాళ్లు మధుమేహం ముందస్తు దశలో ఉన్న వారిపై (ప్రీడయాబిటీస్‌) దిల్లీలోని ఆయుర్వేద ఆసుపత్రిలో పద్ధతి ప్రకారం ఔషధ ప్రయోగ అధ్యయనాలు చేశారు. దీంతో 67% మందిలో రక్తంలో గ్లూకోజు బాగానే తగ్గుతోందని గుర్తించారు.
మొదటిసారిగా మధుమేహం బయటపడిన చాలామంది వెంటనే అల్లోపతి మందులు వద్దునుకుని మూలికా వైద్యాన్ని ఆశ్రయిస్తుంటారు. ఇలాంటివారు దీన్ని తీసుకుని చూడటం ఉత్తమం. దీనికి- దుష్ప్రభావాల్లేకుండా మూలికా ఔషధాలతో ఉండే ప్రయోజనాలన్నీ ఉన్నాయి. రెండోది- ఆధునిక వైద్యంలో వాడే మెట్‌ఫార్మిన్‌ (సింగిల్‌ టార్గెట్‌ మందు) లాగే ఇది కూడా రక్తంలో గ్లూకోజును తగ్గిస్తోంది, పైగా దీంతో అదనపు ప్రయోజనాలూ ఉన్నాయి. ఇది సురక్షితమని సశాస్త్రీయంగా నిర్ధారణ కూడా అయ్యింది కాబట్టి వీటిని నిశ్చింతగా వాడుకోవచ్చు. మధుమేహం వచ్చిన కొత్తల్లో దీన్ని 10-15 రోజులు వాడి, పరీక్షలు చేయించుకుని ఫలితం ఉంటే కొనసాగించొచ్చు. లేకపోతే ఆధునిక వైద్యానికి వెళ్లొచ్చు. ఇందులో వాడిన ద్రవ్యాలు చరకుడు, సుశ్రుతుడు వంటి ఆయుర్వేద శాస్త్రకారులు సూచించినవే!
దీనిలోని మూలికలు
దారుహరిద్ర- కస్తూరిపుష్పం
విజేసార్‌- వేగిస
గుడూచి- తిప్పతీగ
గుడ్‌మార్‌- పొడపత్రి
మేతిక- మెంతులు
మజీత్‌- మంజిష్ట
మధుమేహం: ఆయుర్వేదీయ చికిత్స!
సనాతన ఆయుర్వేద వైద్య విధానంలో మధుమేహాన్ని అర్థం చేసుకునే తీరుకు చాలా విశిష్టత ఉంది. ఆయుర్వేదంలో ప్రత్యేకంగా పేర్కొన్న 20 ప్రమేహాల్లో మధుమేహం కూడా ఒకటి!
ఒంట్లోంచి నీరు అధికంగా పోవటాన్ని ‘మేహం’ అంటారు. ఇది అధికం కావటాన్ని ‘ప్రమేహం’గా పిలుస్తారు. ఈ ప్రమేహానికి ప్రభూత మూత్రత (మూత్రం అధికంగా రావటం), అవిల మూత్రత (మూత్రంలో ఒక రకమైన జిడ్డు ఉండటం) అనే పేర్లూ ఉన్నాయి. ఆయుర్వేదంలో పేర్కొన్న 20 రకాల ప్రమేహాల్లో- కఫ దోషంతో 10, పిత్త దోషంతో 6, వాత దోషంతో 4 తలెత్తుతాయి. వీటిల్లో కఫ దోష ప్రమేహాలు చికిత్సకు సాధ్యమయ్యేలా ఉంటాయి. పిత్త దోషంతో తలెత్తేవి కష్ట సాధ్యాలు, వాత దోష సంబంధమైనవి అసాధ్యాలు! మధుమేహమన్నది ఈ ప్రమేహాల్లో చివరిది. ఇది మొదటి 19 ప్రమేహాలను నిర్లక్ష్యం చేస్తే సంప్రాప్తిస్తుందని చెప్పారు. అయితే సుశ్రుతుడు మాత్రం.. మధుమేహ వ్యాధిని విడిగా పేర్కొన్నాడు.‘మధు’ అంటే తేనె. ‘మేహం’ అంటే మూత్రం ఎక్కువగా పోవటం. వీరిలో మూత్రంలో మధుర రసం అధికంగా ఉంటుంది కాబట్టి దీన్ని మధుమేహమని పేర్కొన్నారు. నిజానికి మధుమేహాన్ని అసాధ్యమైన జబ్బుగా అప్పట్లోనే గుర్తించారు. ఇది చాలా నెమ్మదిగా, చాపకింద నీరులా కమ్ముకొస్తుంది. ఒకప్పుడు దీన్ని ఒక రకమైన ఆహారంతోనూ ఇతరుల్లో పుట్టించేవారు! అప్పట్లో వంటింట్లో బల్లులు, కప్పల వంటివి ఉండేవి. వంటింటి పొగకు నల్లగా మారిన ఈ జంతువులను బూడిదగా చేసి, దేనిలోనైనా కలిపి తినిపిస్తే ప్రమేహం వస్తుందని కౌటిల్యుడి అర్థశాస్త్రంలోని ‘పర బల విఘాత అధికారం’ పేర్కొంటోంది. అంటే- ఎవరినైనా బలహీనులను చేయాలనుకుంటే వారిపై దీన్ని ప్రయోగిస్తుండేవారన్న మాట!
మధుమేహానికి కారణాలు
1. ఆహారం: ఆయుర్వేదంలో ఆహారానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. మధుమేహానికి కనబడినవన్నీ తినేయటం (ఆస్య సుఖం), విరుద్ధాహారం తీసుకోవటం ముఖ్యకారణమని పేర్కొన్నారు. సరిగా తోడుకోని పెరుగు (మందక దధి) తినటం మధుమేహానికి దారితీస్తుందని కూడా చెప్పారు. అలాగే భోజనానికి ముందు నీళ్లు తాగితే స్థూలత్వం వస్తుంది. ఇది కఫకరంగా మారి క్రమంగా మధుమేహానికి కారణమవుతుంది. మద్యం తీసుకుంటే మధుమేహం వస్తుందని 14వ శతాబ్దంలోనే బసవరాజు పేర్కొన్నాడు. అతిగా నిప్పుల మీద కాల్చిన ఫాస్ట్‌ఫుడ్స్‌ వంటి ఆహారాలు(విదాహి, విదగ్ధ ఆహారాలు) కూడా మధుమేహాన్ని తెచ్చిపెడతాయి.
2. విహారం: అతిగా, ముఖ్యంగా పగలు నిద్ర పోవటం (స్వప్న సుఖం), మద్యం (మద్య సేవనం), ఎక్కువగా బాధపడటం (చింత, శోకం), కోపం (క్రోధం), కడుపు నిండా తిని శృంగారంలో పాల్గొనటం వంటివి మధుమేహానికి విహార సంబంధ కారణాలుగా చెప్పారు.
3. అభిఘాతం: క్లోమానికి గానీ తల, కడుపు, మూత్రాశయం వంటి భాగాలకుగానీ నేరుగా దెబ్బలు తగిలితే మధుమేహం రావొచ్చు. బాధ, కోపం వంటి మానసిక కారణాలను మధుమేహానికి ‘పరోక్ష అభిఘాతాలు’గా పేర్కొన్నారు.
4. సహజం: వంశ పారంపర్యంగానూ మధుమేహం వస్తుందని సుశ్రుతుడు, చరకుడు, బేలుడు బలంగా చెప్పారు. దీన్ని కొవ్వుకు సంబంధించిన ‘మేదో ధాతు వికారం’గా కూడా చెప్పారు
పూర్వరూపాలు
మధుమేహం వచ్చే ముందు కొన్ని లక్షణాలు కనబడతాయి. వీటిని గుర్తుపట్టి జాగ్రత్త పడటం మంచిది.
1. ఘనాంగత- ఒళ్లంతా విపరీతమైన బరువుగా ఉండటం.
2. శీత ప్రియత్వం- చలి, చల్లటి వస్తువులంటే ఇష్టపడుతుండటం.
3. వెంట్రుకలు త్వరగా వూడిపోతుంటాయి.
4. దంతానాం మలాఢ్యత- దంతాల మీద పాచి ఎక్కువగా పేరుకుంటుండటం.
ఎవరిలో, ఎలా వ్యక్తమవుతుంది?
సహజం: వంశపారంపర్యంగా మధుమేహం బారినపడేవారు సన్నగా ఉంటారు. లావుగా ఉండరు. శరీరమంతా ఎండిపోయినట్టు (రూక్షంగా) ఉంటుంది. ఆకలి తక్కువ (అల్పాతి). ఒక దగ్గర కుదురుగా ఉండరు (పరిసరణ జీవితం).
అపథ్య నిమిత్తజం, దోషజం: అపథ్యం చేయటం వల్ల కఫం పెరిగి మధుమేహం రావొచ్చు. ఇలాంటి వాళ్లు ఎక్కువగా తింటారు. కాబట్టి లావుగా ఉంటారు. శరీరం జిడ్డుగా (స్నిగ్ధంగా) ఉంటుంది. వీరికి ఎక్కువగా ఆకలి వేస్తుంది. ఎప్పుడూ పడుకోవటానికి ఇష్టపడతారు.
స్థూలం: లావుగా ఉన్నవారికి మధుమేహం ముప్పు ఎక్కువ.
కృశం: సన్నగా ఉన్నవారికి ధాతు క్షయం వల్ల వ్యాధి వస్తుంది.
చికిత్స- మూడు రకాలు
ప్రధానంగా మూడు రకాలు చికిత్సలు సూచించారు. శోధనం, శమనం, రసాయనం
శోధనం: లావుగా ఉన్నవారికి శోధనం చేయాలి. సన్నగా ఉన్నవారికి చేయకూడదు. ఇందులో ప్రధానంగా విరేచనం చేయిస్తారు.
శమనం: ఇందులో మూడు రకాల చికిత్సలున్నాయి.
1. మూలికా ఔషధాలు: మధుమేహానికి ఉసిరి (ఆమలకి), తిప్పతీగె (గుడూచీ), కామంచి (కాకమాచి), మామిడిపూత (ఆమ్ర పుష్పం), వేప (నింబ), గుగ్గులు, పాషాణభేది ముఖ్యమైన మూలికలు. శతావరి రసాన్ని పాలతో తీసుకుంటే ప్రమేహం బాగా తగ్గుతుంది. పిప్పళ్లు, మంజిష్ట కూడా మధుమేహానికి మంచివని సూచించారు.
2. రస ఔషధాలు: శిలాజిత్తు, అభ్రక భస్మం, రజత భస్మం, స్వర్ణమాక్షిక భస్మం ముఖ్యమైనవి. తామ్రయోగం మందును రాత్రిపూట నోటిలో పెట్టుకుని పడుకుంటే (వక్త్రే సంధారయేత్‌ నిశి ప్రమేహ హరం) తెల్లారిన తర్వాత రక్తంలో చక్కెర స్థాయులు తగ్గుతాయని వాగ్భటుడు చెప్పాడు.
3. మూలిక-రస ఔషధాలు: ఇందులో మూలికలు, రస ఔషధాలు రెండూ కలిసి ఉంటాయి. మధుమేహులకు ధన్వంతరీ ఘృతం బాగా పనిచేస్తుంది. సర్వేశ్వర రసం మొండి మధుమేహానికీ పనికివస్తుందని (మధుమేహాత్‌ సుదుర్జయం హంతి) ‘భైషజీయ రత్నావళి’లో పేర్కొన్నారు. హరిశంకర రసం 20 రకాల ప్రమేహాలను తగ్గిస్తుందని గట్టిగా చెప్పారు (ప్రమేహాన్‌ వింశతిం హంతి.. సత్యం సత్యం నసంశయః). పంచలోహ రసాయనం అనే మందును ‘సర్వ మేహ కులాంతకం’గా భావిస్తారు. అంటే ప్రమేహాల మూలంగా తలెత్తే జబ్బులన్నింటినీ తగ్గిస్తుందన్నమాట. మరో మంచి మందు ఉమాశాంభవ రసం. పిల్లల నుంచి వృద్ధుల వరకూ వయసును బట్టి దీన్ని తగిన మోతాదుల్లో వాడుకోవాల్సి ఉంటుంది.
రసాయనాలు: బలాన్నిచ్చే రసాయనంగా పనిచేస్తూ మధుమేహాన్ని తగ్గించే ఔషధాలూ కొన్ని ఉన్నాయి. సప్తవింశతి గుగ్గులు, లోహభస్మం, కైశోర గుగ్గులు, బహుశాల గుడం, బబ్బులారిష్ట, కాంత వల్లభ రసం ముఖ్యమైనవి. లోహభస్మం అన్నింటికన్నా ఉత్తమమైన రసాయనం. రసాయనాల్లో పాక్షిక, మాసిక, ద్వైమాసిక, త్రైమాసిక.. ఇలా లక్షణాలను బట్టి ఎన్ని రోజులు వాడాలనేది నిర్ణయిస్తారు.
పథ్యం 
తినాల్సినవి..
పాత ధాన్యం తినాలి. ఇది పథ్యంగానే కాదు, చికిత్సగానూ పనిచేస్తుంది. గోధుమలు, ఉల్లిపాయ, తక్రం- చిక్కటి మజ్జిగ (ఒక భాగం నీళ్లు మూడు భాగాలు పెరుగు కలిపి చిలికినది), శెనగలు తినాలి. తిక్తశాకం- చేదుగా ఉండే కూరలు, పాత ఉలవలు ఎక్కువగా తీసుకోవాలి. భోజనం చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో నీళ్లు తాగుతుండాలి.
విహారపరంగా..
మధుమేహ చికిత్సలో ఆహారంతో పాటు విహారానికీ ఎంతో ప్రాధాన్యముంది. ఆయుర్వేదంలో వ్యాయామం చేయాలని చెప్పటంతో పాటు ఇందుకు కొన్ని విధానాలనూ సూచించారు. చెప్పుల్లేకుండా మునిలా నడవటం (పాదత్ర రహితో మునివర్తనః), వంద యోజనాల దూరం నడవటం (యోజనానాం శతం యయత్‌), ముఖ్యంగా బావులు తవ్వటం (ఖమేత్వా సలిలాశయవ) వంటివి సూచించారు. ‘గ్రామైక రాష్ట్రం భైక్ష్వాతి’- అంటే భోజనం కోసం భిక్షాటన చెయ్యాలని చెప్పారు. అది కూడా ఒక వూరిలో ఒక రాత్రి మాత్రమే ఉండాలి. తెల్లారి మరో వూరులో భిక్షాటన చెయ్యాలి. అంటే ప్రతిరోజూ విధిగా నడవాలని, ఆహారాన్ని మితంగానే తినాలని సూచించేందుకు సూత్రకారులు ఇటువంటి నిబంధనలను విధించారన్నది సుస్పష్టం.
అపథ్యం
తినకూడనవి: కొత్త బియ్యం తినకూడదు. అలాగే పెరుగు తినకూడదు. మద్యం తాగకూడదు. నూనెలో బాగా వేయించిన గోధుమ పదార్థాలు తినకూడదు.
తీపి పదార్థాలు ఎక్కువగా తినకూడదు. మరో విషయం ఏంటంటే వీటిని ఎక్కువగా తిన్నంత మాత్రాన మధుమేహం రాదు. తిని శారీరక శ్రమ చేయకపోతేనే వస్తుంది.
ఎక్కువ చలిలో, ఎక్కువ వేడిలో తిరగకూడదు. కండుపు నిండా భోజనం చేశాక సంభోగం చేయరాదు.
ఉపద్రవాలు
మధుమేహానికి చికిత్స తీసుకోకపోతే పలు దుష్ప్రభావాలు తలెత్తొచ్చు.
ఎక్కువగా దాహం వేస్తుంది. జ్వరం వస్తుంది. శరీరం దుర్బలంగా మారుతుంది. గ్యాంగ్రీన్‌ (పూతీమాంస) వస్తుందని, కురుపులు (పిడక) తలెత్తుతాయని అప్పట్లోనే చెప్పారు. వీరికి గుండె పోటు (హృత్‌ శూల) ముప్పు ఎక్కువని సుశ్రుతుడు చెప్పాడు.
మొత్తానికి మధుమేహం అసాధ్యమైన వ్యాధి అని గుర్తించాలి. దీనికి జీవితాంతం మందులు వేసుకోవాల్సిందే. విరుద్ధాహారం తినకుండా చూసుకుంటే మధుమేహం నియంత్రణలో ఉంటుంది. ఆహార, విహార నియమాలతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే మధుమేహం రాకుండానూ చూసుకోవచ్చు.
సుశ్రుతుడేం చెప్పాడంటే...
గమనాత్‌ స్థానం- నడుస్తున్నప్పుడు ఆగిపోవాలనిపించటం
స్థానాత్‌ ఆసనం- ఆగినప్పుడు కూచోవాలనిపించటం
ఆసనాత్‌ శయనం- కూచుంటే పడుకోవాలనిపించటం
శయనాత్‌ స్వప్నం- పడుకోగానే నిద్ర వచ్చేస్తుండటం
- ఈ లక్షణాలు కనిపించే వారిలో మధుమేహం తలెత్తే అవకాశం ఎక్కువని సుశ్రుతుడు ఎన్నడో సుస్పష్టంగా పేర్కొన్నాడు. దీనికి వాగ్భటుడు ‘అస్వాస్థ్యం సర్వ గాత్రేషు’ అనే మరో సూత్రాన్ని కూడా జోడించాడు. అంటే మధుమేహం కారణంగా శరీరంలోని అవయవాలన్నీ అనారోగ్యం పాలవుతాయని! మధుమేహుల్లో కంటి నుంచి కాళ్ల వరకూ సర్వాంగాల్లో సమస్యలు తలెత్తటం చూస్తూనే ఉంటాం. వీటిని వాగ్భటుడు ఆ కాలంలోనే వివరించాడు.
శరీరమంతా మధురంగా..
‘మాధుర్యాశ్చ తనో అతః’ అన్నది సుశ్రుతుడి వ్యాఖ్య. వాగ్భటుడు కూడా ఇదే చెప్పాడు. దీని ప్రకారం.. మధుమేహం వచ్చినపుడు శరీరం మాధుర్యంగా తయారవుతుంది. అంటే రక్తంలో గ్లూకోజు స్థాయులు పెరుగుతాయని అర్థం చేసుకోవచ్చు.
ప్రయోగాల్లో..మనమే ముందున్నాం!
యుర్వేద, యునాని, సిద్ధ వంటి వైద్య విధానాలలో పరిశోధనలను మన ప్రభుత్వాలు పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నాయి. ముఖ్యంగా లక్నోలోని సీడీఆర్‌ఐ, సీఎఫ్‌టీఆర్‌ఐ, హైదరాబాద్‌లోని ఎన్‌ఐఎన్‌ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలన్నీ మన దేశంలో వివిధ వైద్య విధానాల్లో వాడే రకరకాల మూలికా ఔషధాలపై దాదాపు 50 ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నాయి. భారతీయ వైద్య పరిశోధనా మండలి డైరెక్టర్‌ జనరల్‌గా చేసిన డా॥ జి.వి.సత్యవతి 30 ఏళ్ల పాటు దాదాపు 250 రకాల వృక్ష సంబంధ ఔషధాలపై పరిశోధనలు చేసి, అంతర్జాతీయ స్థాయి పత్రాలు వెలువరించారు. మధుమేహానికి సంబంధించి- అన్ని వైద్య పద్ధతుల్లోనూ బాగా ప్రాచర్యంలో ఉన్నది నేరేడు (షీజియం). అయితే ప్రయోగాల్లో దీనిలో మధుమేహాన్ని తగ్గించే గుణాలు అంతగా లేవని తేలింది. ఏదైనా ఒక పదార్థానికి మధుమేహాన్ని తగ్గించే గుణం ఉందా? లేదా? అన్నది తెలుసుకునేందుకు ‘సల్ఫనైల్‌ యూరియా సెన్సిటివిటీ పరీక్ష’ అన్నది ప్రామాణికంగా చేస్తుంటారు. ఒక మనిషికి ఉదయాన్నే 250 మి.గ్రా. గ్లూకోజు ఇచ్చి, వెంటనే పరిశోధించాల్సిన ద్రవ్యాన్ని 10-20 మి.గ్రా. వరకూ ఇచ్చి, ఏమీ తినకుండా 4 గంటల పాటు ఉంచి అప్పుడు- రక్తంలో గ్లూకోజు తగ్గిందా? అన్నది పరీక్షిస్తారు. గ్లూకోజు కనీసం 30% తగ్గితే ఆ ద్రవ్యానికి ఔషధ ప్రభావం ఉన్నట్టు. అప్పుడు వాటిపై మరిన్ని పరిశోధనలు చేస్తారు. మనకు తెలిసి భారత దేశంలో- కాకర, మెంతులు, వేగిస, ఉసిరి, పసుపు, మర్రి వంటి వాటితో దాదాపు 30% తగ్గుతోంది. మెంతులపైన హైదరాబాద్‌లోని ఎన్‌ఐఎన్‌లో, నిజామ్స్‌ ఆసుపత్రిలో లోతుగా ప్రయోగాలు చేశారు. ఎన్‌ఐఎన్‌లో వాసన, కొవ్వు, చేదు లేకుండా మెంతి పొడిని రూపొందించారు. ఆ పొడిని 3 నెలల పాటు వాడి, ఇది దాదాపు మెట్‌ఫార్మిన్‌తో సరిసమానంగా పని చేస్తోందని, రక్తంలో గ్లూకోజు తగ్గించటమే కాదు, ఇది శరీరంలోని ఇన్సులిన్‌ పరిమాణాన్ని కూడా పెంచుతోందని నిమ్స్‌లో జరిగిన అధ్యయనాల్లో వెల్లడైంది. ఈ మెంతి పొడిని రోజూ 25 గ్రా. చొప్పున మూడేళ్ల పాటు ఇచ్చి, ఇది ముందస్తు మధుమేహుల్లో త్వరగా మధుమేహం రాకుండా నివారించటానికీ సాధ్యపడుతోందని నిరూపించారు. మెంతులు, కాకర వంటివి ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే కడుపులో పుండ్లు వంటివి రావచ్చు. అందుకని ఇలా వైద్యపరంగా సిద్ధం చేసిన మెంతిపొడిని వాడటం అవసరం. అలాగే కాకర గురించి దిల్లీ తదితర ప్రాంతాల్లో జరిగిన పరిశోధనల్లో అది మధుమేహం తగ్గేందుకు ఉపయోగపడుతోందని చూచాయగా తేలినా, పూర్తిగా నిరూపణ కాలేదు. మెంతులు, కాకర వంటి వాటి నుంచి పూర్తిస్థాయి మధుమేహ ఔషధాన్ని తయారుచేసే వీలుందేమోనని పరిశోధించారుగానీ వీటిలో ఏ ఒక్కటీ ఔషధంగా పనికొచ్చేంత స్థాయిలో లేదని గుర్తించారు. ఇలాంటి మందు కోసం 50-60 ఏళ్లుగా మన దేశంలో ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల్లో వేల కోట్ల రూపాయల వ్యయంతో నిరంతర ప్రయోగాలు జరుగుతున్నాయి. 1985లో ఐసీఎంఆర్‌ పరిశోధకులు పసుపు, వేగిస, పెద్ద ఉసిరి, గోరుచిక్కుడు- వీటితో మిశ్రమం తయారుచేసి అధ్యయనాలు చెయ్యగా దీనితో రక్తంలో గ్లూకోజు తగ్గుతోందని గుర్తించారు. అయితే ఇదొక వ్యాపార ఉత్పత్తిగా బయటకు రాలేదు. తర్వాత 6 రకాల ద్రవ్యాలు కలిపి ప్రయోగాలు చేశారు. దీనివల్ల నష్టం లేదని, మధుమేహాన్ని కొంత వరకూ తగ్గిస్తోందని గుర్తించారు. కానీ ఇది సల్ఫనైల్‌ యూరియా పరీక్షలో నిలబడలేదు.
మొత్తానికి ఇప్పుడున్న ఆధునిక మందులతో సరిసమానంగా రక్తంలో గ్లూకోజును తగ్గించే విషయంలో వీటితో పూర్తి ప్రయోజనం సిద్ధించటం లేదని గుర్తించారు. కాబట్టి వీటిని ఇతర మందులతో పాటుగా వాడుకోవచ్చుగానీ పూర్తిగా వీటి మీదే ఆధారపడకూడదన్నది సుస్పష్టం. కాకర రసం వంటివి ఎక్కువ మోతాదులో తాగటం కంటే ప్రయోగాత్మకంగా సురక్షితమని నిరూపణ అయిన ఔషధాలను వాడుకోవటం, అదీ కొత్తలో కొంతకాలం వాడి చూసుకుని, దాంతో తగ్గుతుంటే కొనసాగించటం, లేకుంటే ఆధునిక ఔషధాలకు మారటం మంచిది.



When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FRESHDEALS365.COM....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment