దమ్మున్న ఐపీఎస్ దుమ్మురేపుతున్నారు. అక్రమార్కుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. సెటిల్‌మెంట్లు చేసే వారిని సెటిల్ చేస్తున్నారు. అక్రమార్కుల కొమ్ముకాసే అధికార పార్టీ నేతలను కూడా ఆయన వదలడం లేదు. దొంగ దందాలు చేసేవారికి, వాటిని ప్రోత్సహిస్తున్నవారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో దో నంబర్ దందా చేస్తున్న వారికి తనదైన శైలిలో ట్రీట్‌మెంట్ ఇస్తున్న ఆ ఐపీఎస్ అధికారి వ్యవహార శైలిపై ప్రత్యేక కథనం...
మంచిర్యాల... ఆదిలాబాద్ జిల్లాలోనే ముఖ్య పట్టణం ఇది! ఓ రకంగా అనధికార జిల్లా కేంద్రమని చెప్పుకొవచ్చు. తెలంగాణ జిల్లాలలోనే ఆర్ధిక లావాదేవీలు ఎక్కువగా జరిగే టాప్‌టెన్ పట్టణాల్లో ఇది కూడా ఒకటి! రేపోమాపో జిల్లాగా మారబోతున్న పట్టణం. నిత్యం వందల కోట్ల రూపాయల వ్యాపారం జరిగే ప్రాంతం. అదే సమయంలో రాజకీయ నాయకుల అండదండలతో రౌడీలు, మాజీ మావోయిస్టులు, వారి సానుభూతి పరులు అనేక అక్రమాలు చేస్తున్న ఏరియా కూడా ఇదే! పట్టణం విస్తరిస్తున్న కొద్దీ ఇక్కడ భూ కబ్జాలు, సెటిల్‌మెంట్లు నిత్యకృత్యంగా మారాయి. దీనికి తోడు బొగ్గు, బియ్యం, స్ర్కాప్, మద్యం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగిపోతున్నాయి. చట్ట విరుద్ధ ఫైనాన్స్ దందాకు.. పేకాట తదితర జూదాలకు మంచిర్యాల అడ్డగా మారింది. అధికారుల అండదండలతో పలువురు అక్రమార్కులు, చోటామోటా నేతలు ఈ ప్రాంతంలో చెరువులను, కాలువలను మింగేస్తున్నారు. ప్రభుత్వ భూములను హాంఫట్ చేస్తున్నారు. అక్రమంగా పట్టాలు పొంది అంతే అక్రమంగా రిజిస్ర్టేషన్‌లు గట్రాలు కానిచ్చేసుకుని వందల కోట్ల రూపాయలను వెనకేసుకున్నారు. పాపం వీరి దగ్గర భూములు కొన్న అనేక మంది దారుణంగా మోసపోయారు. ఇప్పుడు న్యాయం కోసం కోర్టుల చుట్టూ, పోలీసుల చుట్టూ తిరుగుతున్నారు.
ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతల అండదండలతో అక్రమదందాలు చేయడం ఇక్కడ కొందరికి అలవాటుగా మారింది. ఇలాంటి సమయంలోనే గత ఏడాది జనవరిలో మంచిర్యాల అసిస్టెంట్ పోలీస్ సూపరింటెండెంట్‌గా ఐపీఎస్ ఎస్.ఎం.విజయ్‌కుమార్ బాధ్యతలు స్వీకరించారు. కర్ణాటకు చెందిన విజయ్‌కుమార్ ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టినప్పట్నుంచి అక్రమ దందాలపై దృష్టి పెట్టారు. భూ లావాదేవీల్లో మోసపోయిన అనేక మంది బాధితులు రోజూ తన దగ్గరకు వస్తుండటంతో విజయ్‌కుమార్ సీరియస్ అయ్యారు. అక్రమార్కులకు అంతే సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. విజయ్‌కుమార్‌కు భయపడి కొందరు అక్రమదందాలకు స్వస్తి చెప్పారు. అయితే అధికార పార్టీ నేతల అండదండలు ఉన్న కొందరు మాత్రం తమకేది కాదన్న పొగరుతో కొనసాగిస్తున్నారు. ఇక లాభం లేదనుకున్న ఏఎస్పీ మంచిర్యాల నియోజకవర్గానికి చెందిన ఓ కీలక ప్రజాప్రతినిధి కుమారుడిని, మంచిర్యాల మునిసిపాలిటీ పాలకవర్గంలోని పలువురు నేతలను ఠాణాకు పిలిపించుకుని తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారట! దందాలు మానుకోకపోతే బొక్కలో వేస్తానని హెచ్చరించారట! దీంతో ఎందుకొచ్చిన గొడవ అనుకుని కొందరు మునిసిపాలిటీ ప్రజాప్రతినిధులు వ్యాపారాలకు దూరంగా ఉంటున్నారు. మరోవైపు ఏఎస్పీ తన తాట తీస్తారని భావించిన సదరు ప్రజాప్రతినిధి కుమారుడు మాత్రం మంచిర్యాలను వదిలేసి హైదరాబాద్‌కు మకాం మార్చారట!
దీనికి తోడు అక్రమ ఇసుక, బొగ్గు, స్ర్కాప్‌లను తరలిస్తూ కోట్లు గడిస్తున్న వారిపై ఎప్పటికప్పుడు దాడులు చేశారు. అన్నింటికి మించి రేషన్ బియ్యం నిల్వలకు అడ్డగా మారిన ఓ ప్రముఖ రైస్ మిల్లుపై దాడులు చేశారు. వందల టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతలకు, అధికారులకు మామూళ్లు ఇస్తూ కోట్లకు కోట్లు సంపాదిస్తున్న సదరు రైస్ మిల్లు యజమాని ఏఎస్పీ ఇచ్చిన షాక్‌తో ఇంకా కోలుకోవడం లేదట! అక్రమదందాల కేసుల్లో నాయకుల ప్రమేయాన్ని పూర్తిగా తగ్గించడం, పైరవీ కారులను దూరంగా పెట్టడం, తప్పు చేసిన వారు ఎంతటివారైనా కేసులు పెట్టడంతో అధికార టీఆర్‌ఎస్ పార్టీ నేతలకు ఆయనంటే కంటగింపుగా మారింది. ఓ దశలో విజయ్‌కుమార్‌ను ట్రాన్స్‌ఫర్ చేయించడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. ఓ భూ వివాదంలో బాధితులకు అండగా నిలిచారు విజయ్‌కుమార్. కేసు విచారణలో రెవెన్యూ, రిజిస్ర్టేషన్ అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని తేలింది. దీంతో రెవెన్యూ అధికారుల తీరుపై మండిపడ్డారు ఏఎస్పీ. ఇది రెవెన్యూ అధికారులకు సుతారమూ నచ్చలేదు. తమ విధుల్లో ఏఎస్పీ జోక్యం చేసుకుంటున్నారంటూ రచ్చకెక్కారు. దీన్ని అడ్వాంటేజిగా తీసుకున్న కొంతమంది అధికార పార్టీ నేతలు ఆయనను బదిలీ చేయించేందుకు రాజధానిలో పైరవీలు చేశారు. ఓ మంత్రివర్యులను కూడా కలిశారు. తమకు అనుకూలంగా ఉండే వ్యక్తిని మంచిర్యాల ఏఎస్పీగా నియమించాలని కోరారట! ఇదంతా తెలుసుకున్న యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు విజయ్‌కుమార్‌కు మద్దతుగా రోడ్డెక్కారు. ఏఎస్పీని బదిలీ చేస్తే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఇదేదో మెడకు చుట్టుకునే వ్యవహారంలా ఉందని భావించిన నేతలు బదిలీ ప్రయత్నాలకు స్వస్తి చెప్పారు.
సొంతశాఖలోని అధికారులపై కూడా విజయ్‌కుమార్ నిఘా పెట్టారు. ముఖ్యంగా సబ్ డివిజన్‌లోని పలు పోలీస్ స్టేషన్‌లలో ఆరోపణలు ఉన్న అధికారుల తీరును నిత్యం సమీక్షించారట. దీంతో గతంలో అనేక దందాలకు సహకరించిన కొందరు అధికారులు ఏఎస్పీ హెచ్చరికతో నోరుమూసుకుని అన్ని మానేసుకున్నారు. రెండు నెలల కిందట విజయ్‌కుమార్ ట్రయినింగ్ కోసం వెళ్లినప్పుడు ట్రాన్స్‌ఫర్ అయినట్టేనని భావించి సంబరాలు చేసుకున్నారు అక్రమార్కులు. ట్రైనింగ్‌లో ఉన్నారని తెలిసి అక్కడ్నుంచి అటే పంపించాలనే ప్లాన్ వేశారు. అయితే ట్రయినింగ్ కోసం వెళ్లినా వీకెండ్స్‌లో మంచిర్యాలకు రావడం, ప్రజలకు అందుబాటులో ఉండటం చూసి కుక్కిన పేనులా మారారు నేతలు. పైగా జిల్లా ఎస్పీ తరుణ్ జోషి, బెల్లంపల్లి అడిషనల్ ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్‌లు విజయ్‌కుమార్‌కు నైతిక మద్దతునివ్వడంతో అవినీతిపరుల ఆగడాలు సాగడం లేదు. విజయ్‌కుమార్ తిరిగి పూర్తి బాధ్యతలు స్వీకరించిన తర్వాత సామాన్య ప్రజలు సంబరాలు చేసుకున్నారు. సోషల్ మీడియాలో అయితే విజయ్‌కుమార్‌కు బోలెడంత మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఎక్కడ ఏమి జరిగినా ముందుగా ఏఎస్పీకి తెలిసిపోతోంది. ఇక ముదురు పోలీసు అధికారులున్న ఏరియాలలో సిన్సియర్‌గా పని చేసే యువ అధికారులను ఏఎస్పీ ప్రోత్సహిస్తూ అక్రమాలు జరగకుండా పోలీసు శాఖకు చెడ్డపేరు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. భూమి అమ్మకాలు, కొనుగోలు వ్యవహారాలలో సామాన్యులు మోసపోకూడదనే ఉద్దేశంతో సబ్ డివిజన్ పరిధిలో భారీ ప్రచారం చేస్తున్నారు. కరపత్రాలు ముద్రించి పంచుతున్నారు. వివాదాల్లో ఉన్న భూముల సర్వే నంబర్‌లను కరపత్రాలలో ముద్రించి వాటిని ఎవరూ కొనకూడదని చెబుతున్నారు. అక్రమార్కుల పట్ల సింహస్వప్నంగా మారిన విజయకుమార్‌ను ఉన్నపళంగా బదిలీ చేసే పరిస్థితి లేదు. అయినా కొందరు రియల్టర్లు, దొంగదందాలు చేసే వ్యాపారులు, దోనంబర్ దందా చేసేవాళ్లు దింపుడు కళ్లెం ఆశతో ఉన్నారు. బదిలీ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. అధికార పార్టీ నేతల చుట్టూ తిరుగుతున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకుందామనుకుంటున్న అధికార పార్టీ నేతలు కూడా నిరాశలో పడిపోతున్నారు.
చిన్నప్పటి నుంచే సేవాదృక్పథం ఉన్న విజయ్‌కుమార్ విధులతో పాటు పలు సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. వీధి బాలలను విద్యావంతులుగా తీర్చిదిద్దడంలో తనవంతు సాయం చేస్తున్నారు. పేద విద్యార్థులకు సేవలందించాలని జిల్లాలో ఎన్నో సేవాకార్యక్రమాలు చేపడుతున్న ఏకలవ్య ఆశ్రమం సేవా భారతిని ఐపీఎస్ విజయ్ కుమార్ కోరారు. ఏఎస్పీ సేవా తత్పరతకు ఈ కింది ఫోటోయే నిదర్శనం. ఇలాంటి అధికారులు జిల్లాకు ఒక్కరున్నాచాలని మంచిర్యాల ప్రజలు అంటున్నారు.
When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FRESHDEALS365.COM....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.
0 comments:
Post a Comment