కడప జిల్లాలో కొత్త భయం.. పెరుగుతున్న ఆందోళన!


కడప జిల్లాలో ఇప్పుడు కొత్త భయం తాండవిస్తోంది. ఫ్యాక్షన్‌ గడ్డపై మళ్లీ పొరు మొదలవుతుందా అన్న ఆందోళన కూడా పెరుగుతోంది. ఒకప్పుడు ప్రత్యర్థులను కడతేర్చి జైలుశిక్షలు అనుభవించి విడుదలైనవారికి ప్రాణభయం పట్టుకుందట. ఈ పరిణామంతో మళ్లీ ఎక్కడ కక్షలూ, కార్పణ్యాలు మొదలవుతాయో అని పలు గ్రామాలలో ప్రజలకి నిద్ర కరువైందట. ఇంతకీ ఈ పరిస్థితి ఎందుకు తలెత్తిందో ఈ కథనంలో చూద్దాం.
 
రాయలసీమ అనగానే కళ్లముందు మెదిలేది రక్తచరిత్రే! రెండు దశాబ్దాలకు ముందు వరకూ ఫ్యాక్షన్‌ హిస్టరీలో కడపజిల్లాదే ప్రథమస్థానం. పులివెందులకు చెందిన వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తండ్రి వైఎస్‌ రాజారెడ్డి, జమ్మలమడుగుకు చెందిన శివారెడ్డి అలియాస్‌ బాంబుల శివారెడ్డి హయాంలో కడప జిల్లా ఫ్యాక్షన్‌ ఖిల్లాగా మారిపోయింది. నాటుబాంబుల మోతలు, వేటకొడవళ్ల కోతలతో పల్లెలు నెత్తురోడేవి.
 
మారణాయుధాలతోనే సావాసం చేసిన రాజా రెడ్డి, శివారెడ్డి చివరికి ఆ కత్తులు, బాంబులకే బలైపోయారు. ఆ తర్వాత కొంతమేరకు ఫ్యాక్షన్‌ ప్రభావం తగ్గుముఖం పట్టింది. అంతమాత్రాన పూర్తిగా హత్యలు ఆగిపోలేదు. పాతకక్షలతో అడపాదడపా దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ కడప జిల్లాలో సుమారు వంద గ్రామాలు ఫ్యాక్షన్‌ అడ్డాలుగా పోలీసులు లిస్టులో నమోదై ఉన్నాయి. ప్రస్తుత కథనానికి ఇదంతా ఉపోద్ఘాతం మాత్రమే!
 
ఇప్పుడు మళ్లీ కడప జిల్లాలోని పలు గ్రామాల్లో ఉడుకు మొదలైంది. జనాల్లో భయం తాండవిస్తోంది. తమ పల్లెల్లో మళ్లీ రక్తం చిందుతుందేమో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. దీనికి కారణం ఇటీవల కొందరు ఖైదీలు జైళ్ల నుంచి విడుదల కావడమే. పూర్వరంగంలోకి వస్తే... 1998 మే 23న పులివెందుల ప్రాంతంలోని వేముల వద్ద రాజారెడ్డిని ప్రత్యర్థులు బాంబులు, వేటకొడవళ్లతో హతమార్చారు. ఈ కేసులో మొత్తం 11 మందికి న్యాయస్థానం జీవితఖైదు విధించింది. శిక్షాకాలంలో ముగ్గురు మృతిచెందారు. మిగిలిన 8 మంది పేర్లు సత్ర్పవర్తన కలిగిన వారి జాబితాలో ఉండటంతో జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా విడుదలయ్యారు. ఆ రోజు కడప సెంట్రల్ జైల్ నుంచి మొత్తం 55 మంది ఖైదీలను విడుదలచేయగా వీరిలో 10 మంది మాత్రమే ఇతర జిల్లాలకు చెందినవారు. మిగిలిన వారంతా కడపజిల్లాకి చెందినవారే!
 
రాజారెడ్డి హత్యకేసులో శిక్షపడి విడుదలైన 8 మంది పులివెందుల ప్రాంతంలోని ఫ్యాక్షన్ గ్రామాలకు చెందినవారే. మిగిలిన వారు జమ్మలమడుగు ప్రాంతంలోని ఫ్యాక్షన్ గ్రామాలవారు. అప్పట్లో ఆ రెండు ప్రాంతాల్లో ప్రత్యర్థులను కడతేర్చిన వీరందరికీ కోర్టులు కఠినదండనలే విధించాయి. ఆయా కేసుల తీవ్రతను బట్టి ఒక్కొక్కరికి 14 నుంచి 20 ఏళ్ల వరకు శిక్షపడటంతో ఇంతకాలం వారు జైళ్లల్లోనే మగ్గారు. అయితే శిక్ష ముగిసి ఇప్పుడు బయటి ప్రపంచంలోకి వచ్చిన వారికి కొత్త భయం పుట్టుకుందట. అప్పట్లో ప్రత్యర్థివర్గాల్లో బలమైన వ్యక్తులను మట్టుబెట్టిన కారణంగా ఇప్పుడు వారి వర్గీయులు చూస్తూ ఊరుకోరని, ప్రతీకారంతో తమపై దాడులు చేస్తారేమోనని భీతి పెరుగుతోందట. ఈ భీతితోనే వారు ప్రత్యర్తులను ఎదుర్కొనేందుకు మరోసారి ఫ్యాక్షన్‌పోరుకు సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. ఇంటెలిజెన్స్‌ వర్గాల రిపోర్టులు కూడా ఈ విషయాన్ని బలపరుస్తున్నాయట! దీంతో కడప జిల్లా ఎస్పీ నవీన్ గులాఠీ ఫ్యాక్షన్ గ్రామాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇటీవల సెంట్రల్ జైలు నుంచి విడుదలైన వారి గ్రామాలకి పోలీస్ బలగాలను పంపి కౌన్సెలింగ్ గట్రాలతో పాటు నాకాబందీ నిర్వహిస్తున్నారు. పోలీసుల శాఖ చర్యల సంగతి అటుంచితే... ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమవుతుందోనని ఫ్యాక్షన్‌ గ్రామాల ప్రజలు మరోసారి అప్రమత్తమయ్యారు. గతంతో పోలిస్తే పోలీసుల నిఘా పెరిగినందువల్ల అవాంఛనీయ ఘటనలు జరగకపోవచ్చుననేది కొందరి ఊహాగానం. జరగకూడదనే మనం కూడా కోరుకుందాం.

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FRESHDEALS365.COM....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment