మచ్చ ఏదైనా.. ఎక్కడున్నా? అశ్రద్ధ వద్దు..


డ్రస్‌ మీద మరక కనిపిస్తే....అది ఏ రకం మరక? దాన్ని ఎలా వదిలించాలి? అని ఆలోచిస్తాం. అలాంటి మచ్చలే శరీరం మీద కనిపిస్తే అంతగా పట్టించుకోం. అంతకుముందు లేని మచ్చ ఇప్పుడే ఎందుకేర్పడింది? అది ఏదైనా వ్యాధి లక్షణమా? అనే విషయాల గురించి ఆలోచించం. కానీ చర్మం మీద కొత్తగా ఎలాంటి మచ్చ కనిపించినా లక్షణాలను బట్టి వైద్య చికిత్స తీసుకోవాలి.

ఒంటి మీద పుట్టు మచ్చలు ఎన్నున్నాయో, ఎక్కడున్నాయో వెంటనే చెప్పేస్తాం. పుట్టినప్పటి నుంచి వాటిని గమనిస్తూ వస్తున్నాం కాబట్టి వాటి గురించి మనకు కచ్చితంగా తెలుసు. ఈ మచ్చలు జీవితాంతం మనతోపాటు ఉండేవే! అయితే చర్మం మీద పుట్టు మచ్చలు కాకుండా ఇతరత్రా మచ్చలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. వయస్సు, వ్యాధులు, కాలుష్యం, సూర్యరశ్మి...ఇలా ఎన్నో కారణాల వల్ల చర్మం మీద రకరకాల ఆకారాల్లో, రంగుల్లో మచ్చలు వస్తుంటాయి. వీటిలో అత్యంత ప్రమాదకరమైనవీ ఉంటాయి. తేలికపాటి చికిత్సతో నయమయ్యేవీ ఉంటాయి. వీటిలో ఏ మచ్చ ప్రమాదకరమైంది? ఏది కాదు? అనే విషయం తెలియాలంటే కొన్ని లక్షణాలను కనిపెట్టాలి.

ప్రమాదకరమైనవి
అరచేతులు, అరికాళ్లలో నల్ల మచ్చలు (కేన్సర్‌ కారణం)
3 సెం.మీ కంటే పెద్దగా ఉండే నల్లటి మచ్చలు
శరీరం మీద 50కి మించి పుట్టు మచ్చలుంటే! (వీటిలో ఏదో ఓ మచ్చ
కేన్సర్‌గా మారొచ్చు)
మచ్చ రంగు మారటం
పెరగుతూ ఉండటం
దురద, మంట ఉండటం
మచ్చ దగ్గర ఇన్‌ఫెక్షన్‌ ఉండటం
50 ఏళ్లు దాటిన వాళ్లలో పెరిగే మచ్చలు

మచ్చని పరీక్షించే ‘డెర్మోస్కోపీ’
డెర్మోస్కోపీతో మచ్చను మైక్రోస్కోపిక్‌గా పరీక్షించే వీలుంటుంది. ఈ పరికరాన్ని కంప్యూటర్‌తో కనెక్ట్‌ చేయొచ్చు. డెర్మోస్కోపీలోని పోలరైజ్‌డ్‌ లైట్‌ సహాయంతో మచ్చను దగ్గరగా పరీక్షించి దాని లోతు, లక్షణాలను బట్టి అది ప్రమాదకరమైనదో కాదో బయాప్సీ చేయకుండానే కనిపెట్టొచ్చు. ఒకవేళ మచ్చలోనే కలర్‌ వేరియేషన్‌ కనిపించినా, రక్తనాళాలు ఎక్కువగా ఉన్నా, బార్డర్‌ ఇర్రెగ్యులర్‌గా ఉన్నా బయాప్సీ చేయాల్సిన అవసరం కూడా పడుతుంది. బయాప్సీలో మెలనోమాగా తేలితే అది ఎంత లోతుగా వెళ్లింది? అనే దాన్ని బట్టి ఎంత మేరకు చర్మాన్ని తొలగించాలి? చుట్టుపక్కలున్న లింఫ్‌నోడ్స్‌ ఇన్వాల్వ్‌మెంట్‌ని బట్టి వాటిని తొలగించాలా వద్దా? అనేది నిర్ణయిస్తారు.

మచ్చలు చెప్పే వ్యాధులు
కేంద్ర నాడీ వ్యవస్థ, చర్మం ఈ రెండూ ఒక కణం నుంచే రూపొందాయి. కాబట్టి చర్మం మీద ఏర్పడే ప్రతి మచ్చకూ నాడీ వ్యవస్థకు దగ్గరి సంబంధం ఉంటుంది. అలాగే చూపు, వాసన, స్పర్శ, వినికిడి, రుచి...ఈ పంచేంద్రియాలన్నీ కూడా నాడీ వ్యవస్థతో అనుసంధానమై ఉంటాయి. వీటికి రక్త ప్రసరణ వ్యవస్థ, గుండెలతో కూడా సంబంధం ఉంటుంది. అందుకే ఈ వ్యవస్థలతో సంబంధం ఉన్న ఏ అవయవంలో లోటుపాట్లున్నా ఆ ప్రభావం చర్మం మీద కనిపిస్తుంది. అంటే, వీటిలో ఏ ఒక్క అవయవం జబ్బు పడినా వ్యాధి లక్షణాలు మచ్చల రూపంలో కనిపిస్తాయి.

చిన్న పిల్లల్లో: చిన్న పిల్లల్లో వచ్చే మచ్చలు వంశపారంపర్యంగా ఏర్పడేవే! వీటిని వైద్య పరిభాషలో ‘లెంటిజీన్స్‌’ అంటారు. ఇవి చిన్న పుట్టుమచ్చల సైజు నుంచి అరచేయంత పెద్దగా కూడా ఉండొచ్చు. పుట్టినప్పుడు లేకపోయినా పుట్టిన కొద్ది రోజులకి కనిపిస్తాయి. నలుపు, కాఫీ రంగుల్లో ఉండే మచ్చలున్న పిల్లల్లో మెదడు, నాడీ వ్యవస్థ, గుండె...మొదలైన అంతర్గత అవయవాల్లో లోపం ఉండొచ్చు. కాబట్టి పసి పిల్లల్లో ఇలాంటి మచ్చలు కనిపిస్తే వెంటనే వైద్యుల చేత పరీక్ష చేయించాలి. కొందరు పిల్లల్లో ‘బేదింగ్‌ సూట్‌’ను పోలినట్టు మచ్చలు కనిపిస్తాయి. ఇవి స్కిన్‌ కేన్సర్‌ ‘మెలనోమా’కు సూచన.

టీనేజర్స్‌లో: టీనేజర్స్‌లో కనిపించే మచ్చలు ‘ఫ్రికిల్స్‌’. ఎక్కువగా ఎండకు గురయితే ఈ రకం మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చల్నే సన్‌ ట్యాన్‌ అని కూడా అనొచ్చు. కొందరు టీనేజర్స్‌లో చెంపలు ఎర్రగా మారే ‘రోసాషే’ అనే మచ్చలు కూడా ఏర్పడతాయి. చర్మం పలుచబడి అడుగునుంచే రక్త నాళాలు పైకి తేలడంతో ఈ రకం మచ్చలు ఏర్పడతాయి. పైపూత మందులు, లేజర్‌ చికిత్సతో రోసాషే మచ్చల్ని వదిలించొచ్చు.

కొందరు ముఖం మీద వచ్చే మొటిమల్ని గిల్లుకుంటూ ఉంటారు. దాంతో మెటిమల స్థానంలో మచ్చలు ఏర్పడతాయి. వీటిని లేజర్‌ ట్రీట్మెంట్‌, కెమికల్‌ పీల్స్‌ సహాయంతో పోగొట్టవచ్చు. సూర్యరశ్మికి గురయితే ‘యాక్టినిక్‌ కెరటోసిస్‌’ అనే మచ్చలు ఏర్పడతాయి. తెల్ల చర్మం ఉన్న వాళ్లకు యాక్టినిక్‌ కెరటోసిస్‌ ఎర్రగా ఉండి పొలుసులుగా ఉంటుంది. నల్ల చర్మం కలిగిన వారికి మరింత ముదురు రంగులో ఏర్పడతాయి. నుదురు, ముక్కు, బుగ్గల మీదే ఈ మచ్చలు ఎక్కువగా ఏర్పడతాయి.

మధ్య వయస్కుల్లో: రోసాషే మధ్య వయస్కుల్లోనూ కనిపించొచ్చు. స్టిరాయిడ్స్‌ వాడకం వల్ల వీళ్లలో ఈ రకం మచ్చలు ఏర్పడతాయి. హార్మోన్లలో అవకతవకల వల్ల కూడా ‘పిగ్మెంటేషన్‌’ అనే గోధుమ రంగు మచ్చలు ముఖం మీద కనిపిస్తాయి. హార్మోన్‌ ట్రీట్మెంట్‌ తీసుకుంటే పిగ్మెంటేషన్‌ మచ్చలు పోతాయి. ఈ రకం మచ్చలు గర్భిణుల్లో కూడా కనిపించి ప్రసవమైన తర్వాత మాయమవుతూ ఉంటాయి. గర్భిణుల్లో వచ్చే ఈ రకం మచ్చల్ని ‘మెలాస్మా’ అంటారు. ఈ మచ్చలు కొందర్లో ప్రసమయ్యాక పోకుండా ఉండిపోతాయి. అలాంటప్పుడు హార్మోన్‌ టెస్ట్‌ చేసి హెచ్చుతగ్గుల్ని సరిదిద్దితే మచ్చలు పోతాయి. కొందరు సీ్త్రలు ఓరల్‌ పిల్స్‌ వాడతారు. ఇవి హార్మోన్‌ బేస్‌డ్‌ పిల్స్‌ కాబట్టి, ఇవి వాడిన కొంతమందిలో మచ్చలు ఏర్పడతాయి. అలాగే మధుమేహం, థైరాయిడ్‌లాంటి మెటబాలిక్‌ డిజార్డర్లతో బాధపడే వాళ్లలో కూడా మచ్చలు కనిపిస్తాయి. కారణాన్ని బట్టి చికిత్సనందిస్తే ఈ మచ్చలు క్రమంగా
మాయమవుతాయి.

మధ్య వయస్కులైన మహిళల్లో ‘పిగ్మెంటేషన్‌
మధ్య వయస్కులైన మహిళల్లో మెలాస్మా, లైకెన్‌ప్లానస్‌, యాషీ డెర్మటోసిస్‌, మొటిమలు, హార్మోన్‌ అసమతుల్యత వల్ల పిగ్మెంటేషన్‌తో, సన్‌ ఎక్స్‌పోజర్‌, సన్‌ అలర్జీల వల్ల రకరకాల మచ్చలు ఏర్పడతాయి. కొందరు మహిళలకి పిగ్మెంటేషన్‌ వల్ల కాళ్లు, చేతుల మీద కూడా మచ్చలు ఏర్పడతాయి. ఈ పరిస్థితిని ‘ఎమాలాయిడోసిస్‌’ అంటారు. రక్తనాళాల్లో లోపం వల్ల కూడా కాళ్ల మీద పిగ్మెంటేషన్‌ మచ్చలు ఏర్పడతాయి. కొన్ని ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్ల వల్ల కూడా పిగ్మెంటేషన్‌ కనిపించొచ్చు. ఈ మచ్చలకు కారణాన్ని సరిదిద్దటం ద్వారా ఈ మచ్చల్ని పోగొట్టవచ్చు.

వృద్ధుల్లో: వృద్ధుల్లో కనిపించే మచ్చల్ని ‘యాక్టినిక్‌ కెరటోసిస్‌’, ‘సెబోరిక్‌ కెరటోసిస్‌’ లేదా ‘స్టకో కెరటోసిస్‌’ అంటారు. వయసు పెరిగేకొద్దీ చర్మంలోని కొల్లాజెన్‌ కరిగి, చర్మం సాగే గుణాన్ని కోల్పోతుంది. చర్మం పలుచగా కూడా తయారవుతుంది. దాంతో ఇలా రకరకాల మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలన్నిట్లో చాలావరకూ కూడా ప్రమాదం లేనివే ఉంటాయి. అయితే ఎక్కువగా ఎండకు గురవటం మూలంగా వృద్ధుల్లో ఏర్పడే మచ్చల విషయంలో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి. ఆ మచ్చలు బుడిపెల్లా మారి దురద, మంట, డిశ్చార్జ్‌లాంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. కేన్సర్‌తో కూడిన ఇలాంటి మచ్చలు ‘బేసల్‌ సెల్‌ కార్సినోమా’ కోవకు చెందినవి. 50 అంతకంటే ఎక్కువ వయసు దాటిన వాళ్లలో ఈ రకం మచ్చలు కనిపిస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి.

కొనితెచ్చుకునే స్కిన్‌ కేన్సర్‌: కొంతమంది చర్మం మీద ఏదైనా మచ్చ కొత్తగా ఏర్పడితే దాన్ని గిల్లుతూ, గీరుతూ ఇరిటేట్‌ చేస్తారు. ఇలా చేయటం వల్ల ఆ ప్రదేశంలో కేన్సర్‌ పుడుతుంది.

ప్యాచ్‌ టెస్ట్‌
కాస్మటిక్స్‌, హెయిర్‌ డైల అలర్జీ వల్ల కూడా ముఖం, ఇతర శరీరావయవాలపై మచ్చలు ఏర్పడతాయి. కాబట్టి వీటిని మొదటిసారి ఉపయోగించే ముందు తప్పనిసరిగా ప్యాచ్‌ టెస్ట్‌ చేసుకోవాలి. చెవి వెనక కొంత అప్లై చేసి ఎలాంటి దురద, మంట లేకపోతే అప్పుడే వాటిని వాడటం మొదలుపెట్టాలి. కొందరు మార్కెట్లోకొచ్చే ప్రతి కొత్త బ్యూటీ ప్రొడక్ట్‌ని వాడాలని అనుకుంటారు. వాడుతున్న కాస్మటిక్స్‌ వల్ల ఎలాంటి ఇబ్బంది లేకపోతే వాటినే కంటిన్యూ చేయటం మంచిది. అలాకాకుండా వాడుతున్న దాన్ని వదిలేసి కొత్తదాన్ని ట్రై చేసి అలర్జీలు కొని తెచ్చుకోకూడదు. ఒకవేళ వాడాలనుకున్నా ప్యాచ్‌ టెస్ట్‌ చేయాలి. ఒకవేళ ప్లాస్టిక్‌, ఆర్టిఫిసియల్‌ జ్యువెలరీ, లెదర్‌ వస్తువుల వల్ల అలర్జీ కనిపిస్తే వాటి వాడకాన్ని వెంటనే మానేయాలి.

మచ్చలకు చికిత్సలెన్నో!
మచ్చకు కారణాన్ని బట్టి చికిత్సలుంటాయి. మెలాస్మా, సన్‌ అలర్జీ, మొటిమల వల్ల వచ్చిన మచ్చలను కెమికల్‌ పీల్స్‌తో తొలగించొచ్చు. చర్మం మీద బాగా లోతుగా ఏర్పడిన మచ్చలకు ‘క్యూ స్విచ్‌డ్‌ ఎండియాగ్‌ లేజర్స్‌’తో చికిత్స చేసి తొలగించొచ్చు. ఇలాంటి చికిత్స సంవత్సరం నుంచి రెండేళ్లపాటు కూడా కొనసాగుతుంది.
మచ్చలు లేని చర్మం కోసం
చర్మాన్ని తేమగా ఉంచాలి. ఇందుకోసం వీలైనన్ని ఎక్కువ నీళ్లు తాగాలి.
ఎండ నుంచి రక్షణ కోసం సన్‌స్ర్కీన్‌ లోషన్‌ వాడాలి.
థైరాయిడ్‌ హార్మోన్‌ హెచ్చుతగ్గులున్నవాళ్లు, పొడి చర్మం కలిగినవాళ్లు మాయిశ్చరైజర్‌ వాడాలి.
చర్మ తత్వానికి సరిపడే కాస్మటిక్స్‌ మాత్రమే వాడాలి.
అలర్జీ కలిగించే ప్లాస్టిక్‌, ఆర్టిఫిసియల్‌ జ్యువెలరీ, లెదర్‌ వస్తువులకు దూరంగా ఉండాలి.
తాజా ఆకుకూరలు, పండ్లు తినాలి.
రోజుకి 6 - 8 గంటల నిద్ర తప్పనిసరి.

డాక్టర్‌ పి.ఎల్‌.చంద్రావతి
ఛీఫ్‌ కన్సల్టెంట్‌ డెర్మటాలజిస్ట్‌
కేర్‌ హాస్పిటల్‌, హైదరాబాద్‌.

When you Call., Don't forget to mention that you found this "ADVERTISEMENT or LATEST NEWS" on FRESHDEALS365.COM....I wish to be contacted by shop owners or telemarketers of any other website...TQ visit again for "DAILY DEALS and UPDATES"....For more Call::9966392211.
Share on Google Plus

About Unknown

    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment