30 ఫోర్లు..11 సిక్సర్లు..258 పరుగులు
కేప్ టౌన్:పటిష్టమైన దక్షిణాఫ్రికా బౌలింగ్ ను ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ఊచకోత కోశాడు. అది కూడా ఆరో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. దీంతో టెస్టు కెరీర్ లో స్టోక్స్ తొలి డబుల్ సెంచరీ నమోదు చేయడమే కాకుండా రెండో అత్యుత్తమ ఫీట్ ను నెలకొల్పాడు. 338 నిమిషాల పాటు క్రీజ్ లో ఉన్న స్టోక్స్ 198 బంతుల్లో 30 ఫోర్లు, 11 సిక్సర్లతో దక్షిణాఫ్రికా బౌలింగ్ ను ఓ ఆటాడుకున్నాడు. దక్షిణాఫ్రికా బంతి వేయడమే తడవు అన్నట్టుగా విజృంభించిన స్టోక్స్ 130.0 కు పైగా స్ట్రైక్ రేట్ నమోదు చేశాడు. స్టోక్స్ మరింత ప్రమాదకరంగా మారుతున్న సమయంలో అతన్ని ఏబీ డివిలియర్స్ రనౌట్ రూపంలో పెవిలియన్ పంపడంతో సఫారీలు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ను 629/6 వద్ద డిక్లేర్ చేసింది. అతనికి జతగా బెయిర్ స్టో(150 నాటౌట్;191 బంతుల్లో 18 ఫోర్లు, 2 సిక్సర్లు) భారీ శతకం సాధించాడు.
అంతకుముందు 317/5 ఓవర్ నైట్ స్కోరుతో ఆదివారం బ్యాటింగ్ కొనసాగించిన ఇంగ్లండ్ దూకుడుగా బ్యాటింగ్ చేసింది. ఈ జోడీ ఆరో వికెట్ కు 399 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో ఇంగ్లండ్ కు భారీ స్కోరు సాధ్యమైంది. అంతకుముందు తొలి రోజు ఆటలో హేల్స్(60), కాంప్టాన్(45), జో రూట్(50)లు రాణించిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబడాకు మూడు వికెట్లు దక్కగా,మోర్నీ మోర్కెల్, మోరిస్ లకు తలో వికెట్ దక్కింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన దక్షిణాఫ్రికా వాన్ జిల్(4) ను తొలి వికెట్ రూపంలో కోల్పోయింది. డీన్ ఎల్గర్(4 బ్యాటింగ్),హషీమ్ ఆమ్లా(9 బ్యాటింగ్)క్రీజ్ లో ఉన్నారు.
మ్యాచ్ విశేషాలు..
టెస్టుల్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా బెన్ స్టోక్స్ గుర్తింపు సాధించాడు. స్టోక్స్ 163 బంతుల్లో డబుల్ సెంచరీ చేయగా, అంతకుముందు న్యూజిలాండ్ ఆటగాడ్ నాథన్ ఆస్టిల్ 153 బంతుల్లో ద్విశతకాన్ని సాధించాడు.
ఇంగ్లండ్ తరపున ఆరు నుంచి పదో వికెట్ కు బెన్ స్టోక్స్-బెయిర్ స్ట్ ల 399 పరుగుల భాగస్వామ్యమే అత్యుత్తమం
న్యూలాండ్స్ స్టేడియంలో ఆరో స్థానంలో వచ్చిన ఇంగ్లండ్ ఆటగాడు సెంచరీ సాధించడం 1965 తరువాత ఇదే ప్రథమం. గతంలో మైక్ స్మిత్ ఆరో స్థానంలో వచ్చి సెంచరీ నమోదు చేశాడు.
ఓ ఇంగ్లిష్ ఆటగాడు ఆరు, అంతకంటే కింద స్థానంలో వచ్చి 178 పరుగులకు పైగా సాధించడం 22 ఏళ్ల తరువాత ఇదే తొలిసారి.1993 లో భారత్ పై గ్రేమ్ హిక్ ఆ మార్కును చేరుకున్నాడు.
About Unknown
0 comments:
Post a Comment